Cinnamon : ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. వంటకాల్లో దాల్చిన చెక్కను వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరగడమే కాకుండా దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాల గురించి, అలాగే దీనిని వాడడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, ఒక టీ స్పూన్ తేనెను, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకుని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపునే తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా సన్నగా నాజుగ్గా తయారవుతారు.
మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు దాల్చిన చెక్కను నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని నుదుటి పై రాసి 5 నిమిషాల పాటు మర్దనా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గొంతు బొంగురు పోయినప్పుడు దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ రసాన్ని మింగడం వల్ల గొంతు బొంగురుతోపాటు దగ్గు కూడా తగ్గిపోతుంది. కీటకాలు కుట్టినప్పుడు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి కుట్టిన చోట లేపనంగా రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.
దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోట్లో ఉన్న హానికారక బాక్టీరియా నశించడంతోపాటు చిగుళ్లు కూడా గట్టిపడతాయి. స్త్రీల గర్భాశయ సమస్యలను తొలగించడంలో కూడా దాల్చిన చెక్క సమర్థవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు పాలలో దాల్చిన చెక్క పొడిని తగు మోతాదులో కలిపి తీసుకోవడం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది. జీర్ణాశయ క్యాన్సర్ ను అరికట్టే శక్తి దాల్చిన చెక్కకు ఉంటుందని ఇటీవలి పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను నేరుగా తిన్నా లేదా దాల్చిన చెక్క పొడిని నీటిలో కలుపుకుని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య కణాల వృద్ధి కూడా జరుగుతుంది. దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, దీనిని తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగంగా చేసుకోవాలని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.