నిత్యం మనం తినే ఆహారాల ద్వారా మన శరీరానికి అనేక పోషకాలు అందుతుంటాయి. మన శరీరానికి అందే పోషకాలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి స్థూల పోషకాలు. రెండు సూక్ష్మ పోషకాలు. పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రోటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్).. వీటిని స్థూల పోషకాలు అంటారు. నిత్యం ఇవి మనకు ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అందుకనే వీటిని స్థూల పోషకాలు అంటారు. ఇక సూక్ష్మ పోషకాల జాబితాలోకి విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు వస్తాయి. ఇవి నిత్యం మనకు చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అందుకనే వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.
అయితే కార్బొహైడ్రేట్లు అని చెబుతున్నాం కానీ వాటిల్లో మళ్లీ రెండు రకాలు ఉంటాయి. అవి ఒకటి.. ఆరోగ్యకరమైనవి. రెండు.. అనారోగ్యకరమైనవి.
ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు
బ్రౌన్ రైస్, చిలగడ దుంపలు, తృణ ధాన్యాలు, వాల్ నట్స్, పల్లీలు (వేరుశెనగలు), చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, క్వినోవా, బీన్స్, ఓట్స్, పండ్లు, కూరగాయలు, స్ట్రాబెర్రీలు, యాప్రికాట్స్, శనగలు, పచ్చిబఠానీలు, మిల్లెట్లు (చిరు ధాన్యాలు), పప్పు దినుసులు.. తదితర ఆహారాల్లో ఆరోగ్యకరమై కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అందువల్ల వీటిని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు.
అనారోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు
తెల్ల అన్నం, చక్కెర ఉండే పానీయాలు, కేక్‌లు, ఐస్ క్రీములు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, తెల్ల బ్రెడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, ఫ్రాజెన్ ఫుడ్, బంగాళా దుంపలు, ఇన్‌స్టంట్ ఓట్స్, బీర్, వాఫల్స్, కాక్ టెయిల్స్, రీఫైన్డ్ ఆహారాల్లో అనారోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను వీలైనంత వరకు మానేయాలి. లేదా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
అనారోగ్యకరమైన కార్బొహైడ్రేట్లను తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్లనే నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.