High BP : ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మందే ఉంటారు. అధిక రక్తపోటు సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, పండ్లను, కూరగాయలను తక్కువగా తీసుకోవడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, నిద్రలేమి, అధికంగా కాఫీలను తాగడం వంటి వాటిని అధిక రక్తపోటు సమస్య రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.
అలాగే ధూమపానం, మద్యపానం కూడా ఈ సమస్య రావడానికి కారణాలు అవుతాయి. తలనొప్పి, తల తిరిగినట్టు ఉండడం, కంటి చూపులో తేడా రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, ఛాతిలో నొప్పి, మూత్రంలో రక్తం రావడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు రావడం వంటి లక్షణాలను రక్తపోటు సమస్య ఉన్న వారిలో చూడవచ్చు. అధిక రక్తపోటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రక్తపోటు సమస్య తీవ్రతను బట్టి వైద్యులు మనకు మందులను సూచిస్తారు.
అయితే కొన్నిసార్లు మందులను వాడినప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాంటప్పుడు ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులుభంగా అధిక రక్తపోటు సమస్య నుండి బయట పడవచ్చు. అధిక రక్తపోటును తగ్గించడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలిసిందే.
అయితే అధిక రక్తపోటుతో బాధపడే వారు వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్యతో బాధపడే వారు పాలలో కలిపి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత ఒక గ్లాస్ పాలను గిన్నెలో పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక దంచిన వెల్లుల్లి రెబ్బలను వేసి మరలా మరిగించాలి.
తరువాత ఈ పాలను వడకట్టుకుని తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. వెల్లుల్లిలోని పాలిసల్ఫైడ్స్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత హైడ్రోజన్ సల్ఫైడ్స్ గా మారి రక్తనాళాలు సాగేలా చేసి రక్తపోటును తగ్గేలా చేస్తాయి. ఈ విధంగా పాలలో వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.