Butter Chicken : మనం అప్పుడప్పుడూ చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ ను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. చికెన్ తో చేసే వంటకాల్లో బటర్ చికెన్ కూడా ఒకటి. రెస్టారెంట్లలో ఈ వంటకం మనకు ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ బటర్ చికెన్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బటర్ చికెన్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – పావు కిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, బటర్ – 4 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 4, సన్నగా పొడుగ్గా తరిగిన టమాటాలు – 2 ( పెద్దవి), జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, సాజీరా – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర లీటర్, ఫ్రెష్ క్రీమ్ – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – అర టీ స్పూన్.
బటర్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పసుపు, పెరుగు, నిమ్మరసం, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి అర గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడయ్యాక మారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి వేయించుకోవాలి. చికెన్ పూర్తిగా వేగి రంగు మారే వరకు బాగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ ను వేసి వేడి చేయాలి.
బటర్ కరిగిన తరువాత మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను, జీడి పప్పును వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. అవసరమైతే ఒక చిన్న గ్లాస్ నీటిని పోసి వీటన్నింటిని కూడా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత కళాయిలో బటర్ ను వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత సాజీరా, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ధనియాల పొడి, కారం వేసి చిన్నమంటపై మసాలాలు మాడి పోకుండా కొద్దిగా వేయించుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. తరువాత వేయించిన చికెన్ ముక్కలను కూడా వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత ఫ్రెష్ క్రీమ్ ను, మరి కొద్దిగా బటర్ ను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కసూరి మెంతిని పైన చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే బటర్ చికెన్ తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, రోటీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన బటర్ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.