Ulli Karam : మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. మనం చేసే ప్రతి వంటలోనూ వీటిని ఉపయోగిస్తాం. ఉల్లిపాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయలను వంటల్లో ఉపయోగించడంతోపాటు వీటితో ఉల్లికారం వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ ఉల్లికారాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 2 (పెద్దవి), నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, ఎండు మిరపకాయలు – 8 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – చిటికెడు.
ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకుని చల్లారే వరకు ఉంచాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై పచ్చి వాసన పోయి బాగా వేగేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నం, దోశ, ఊతప్పం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.