Thati Kallu : కల్లు.. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. కల్లులో కూడా తాటికల్లు, ఈత కల్లు, కొబ్బరి కల్లు వంటి రకాలు ఉన్నాయి. వీటిలో తాటి కల్లును తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. తాటి చెట్టు నుండి తాటి ముంజలతో పాటు తాటి కల్లు కూడా లభిస్తుంది. తాటి కల్లును సురాపానంగా భావిస్తారు. ఇది దాదాపు ఆల్కాహాల్ కు సమానంగా ఉంటుంది. ఆల్కాహాల్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కానీ తగిన మోతాదులో తాటి కల్లును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
తాటి కల్లు ఒక దివ్యౌషధమని కొందరు నిపుణులు చెబుతుంటారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి కావల్సిన జవసత్వాలను తాటికల్లు అందిస్తుంది. చెట్టు నుండి అప్పుడే తీసిన తాటికల్లులో మన శరీరానికి అవసరమయ్యే 18 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. తాటికల్లులో దాదాపు 53 రకాల సూక్ష్మ జీవులు ఉన్నాయని గుర్తించారు. దీనిలో ఉండే సూక్ష్మజీవులు మనలో ఉండే వ్యాధి కారక సూక్ష్మ క్రిములను నశింపజేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జంక్ ఫుడ్ లతో మసాలాలతో అస్తవ్యస్థమైన మానవ జీర్ణవ్యవస్థను బాగు చేసే గుణం తాటికల్లుకు ఉంటుంది. తాటి కల్లు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయాన్నే స్వచ్ఛమైన తాటికల్లును తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అంతేకాకుండా తాటికల్లుకు క్యాన్సర్ కారక కణాలను నశింపజేసే శక్తి కూడా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అదే విధంగా టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులకు తాటికల్లు యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. అయితే పుల్లగా మారిన, పులిసిన తాటికల్లు మాత్రం తాగకూడదు.
పులిసిన తాటికల్లును తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. చెట్టు నుండి తీసిన గంటలోపే తాటికల్లును తాగాలి. లేదంటే అది ఆల్కాహాల్ గా మారి అనారోగ్యానికి దారి తీస్తుంది. అలాగే తాటికల్లును ప్రస్తుత కాలంలో రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు. తాటికల్లును తాగాలనుకునే వారు తాజా తాటికల్లును మాత్రమే తాగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.