Muscles : మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో పెరుగు కొద్దిగా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. మనం ఎంత ఆహారాన్ని తిన్నా చివర్లో పెరుగన్నం తింటేనే భోజనం సంపూర్ణమైనది అన్న భావన కలుగుతుంది. పెరుగులో మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మజ్జిగ, పెరుగు తీసుకోవాలని మనకు వైద్యులు సూచిస్తూ ఉంటారు. మన ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడుకోవడంలో కూడా పెరుగుకు మనకు ఉపయోగపడుతుంది. పెరుగును చర్మంపై రాయడం వల్ల చర్మం పై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం కూడా పొడిబారకుండా ఉంటుంది.
పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ కారణంగా చర్మం పాడవకుండా ఉంటుంది. అలాగే పెరుగులో క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగును నేరుగా తీసుకోవడానికి బదులుగా పెరుగులో వీటిని కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగులో జీలకర్ర పొడిని కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తగ్గడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అలాగే పెరుగులో చక్కెరను వేసుకుని తినడం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. శరీరంలో అధికంగా ఉండే వేడి కూడా తగ్గుతుంది. మూత్రాశయ సంబంధిత సమస్యలు కూడా దరి చేరుకుండా ఉంటాయి. నోటిపూత, దంతాల నొప్పులతో బాధపడుతున్నప్పుడు పెరుగులో వామును కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు పెరుగులో మిరియాల పొడి వేసి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. అదే విధంగా పెరుగులో ఓట్స్ ను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రోబయోట్రిక్స్ ప్రోటీన్స్ మన శరీరానికి లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదపడతాయి. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. వివిధ రకాల ఇన్ ఫెక్షన్ లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
అదేవిధంగా పెరుగులో కొద్దిగా పసుపు, అల్లం కలిపి తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ శరీరానికి లభిస్తుంది. ఇది చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ ను పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను, వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేస్తుంది. పెరుగులో తేనెను కలిపి తీసుకోవడం వల్ల కడుపులో ఉండే అల్సర్లు నయం అవుతాయి. ఈ మిశ్రమం యాంటీ బయాటిక్ గా కూడా పని చేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.
అలాగే పెరుగును రోజూ తీసుకోవడం వల్ల పెరుగులో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని, నాడీ వ్యవస్థ పని తీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు పెరుగు ఎంతో మంచిది. ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.