Vijay Antony : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తమిళ నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో విజయ్ ఆంటోని పేరు తెలుగులోనూ మార్మోగిపోయింది. అయితే ఆ తరువాత ఈయన పలు మూవీలను తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అంతగా విజయం సాధించలేదు. అయితే వాస్తవానికి విజయ్ జీవితంలో అన్నీ కష్టాలే. ఆయన సినిమాల్లో హీరో అవడానికి చాలా కష్టపడ్డాడు.
విజయ్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డాడు. అలాగే కటిక పేదరికం నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకి వచ్చాడు. మొదట్లో ఆయన సంగీత దర్శకుడిగా ఉండేవారు. తరువాత ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తరువాత హీరో చాన్స్‌లు వచ్చాయి. ఇలా ఆయన ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు అందరిచే భేష్ అనిపించుకుంటున్నారు.
ఇక విజయ్ తండ్రి మరణించే నాటికి విజయ్‌కి కేవలం ఏడు సంత్సరాలు మాత్రమే. తన చెల్లి వయసు నాలుగు సంత్సరాలు. కాగా ఆయన తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించేది. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా పిల్లల చదువు దెబ్బతింటుందని ఉన్న చోటునుండే దూర ప్రయాణం చేసేది. విజయ్ లయోల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువుకున్నాడు. ఆ తరువాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు. తన తల్లి ఉద్యోగ రీత్యా శిక్షణ తరగతులకు వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆంటోనిని హాస్టల్ లో చేర్పించి తనతో పాటు కూతురును తీసుకువెళ్లింది. అంతేకాదు హాస్టల్ లో ఉన్నప్పుడు అనుకోకుండా రెండు రోజులు సెలవులు వచ్చాయని అప్పుడు తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తల దాచుకున్నానని విజయ్ తెలిపారు.
అలా తల దాచుకున్న సమయంలో తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని కేవలం అరటి పండు తింటూ జీవనం సాగించానంటూ తాను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నాన్ 2012 అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరవాత నటించిన సలీం సినిమాతో విజయ్ అంటోనికి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత వరుస ఆఫర్ లను అందుకున్నాడు. అంతేకాకుండా విజయ్ వివాహం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక జర్నలిస్టు విజయ్ ని ఇంటర్వూ చేయడానికి వచ్చింది. అయితే ఆమెతో అతను ప్రేమలో పడ్డాడు. అనంతరం ఆమెను 2006 లో వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి లారా అనే కూతురు జన్మించింది. ఇలా విజయ్ ఆంటోని తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.