Finger Millet Laddu : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువవుతుందని చెప్పవచ్చు. రాగులను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరానికి కావల్సిన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. రాగులతో ఎక్కువగా జావ, సంగటి, రోటి, లడ్డూ వంటి వాటిని తయారు చేసుకోవచ్చు. రాగులతో చేసే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగులు – ఒక కప్పు, మినపగుళ్లు – పావు కప్పు, యాలకులు – 4, బెల్లం తరుము – ముప్పావు కప్పు లేదా తగినంత, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, నెయ్యి – పావు కప్పు.
రాగి లడ్డు తయారీ విధానం..
ముందుగా రాగులను ఒక కళాయిలో వేసి దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మినపగుళ్లను కూడా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ముందుగా జార్ లో మినపగుళ్లను తీసుకోవాలి. ఇందులోనే యాలకులను కూడా వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకునొ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో రాగులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని దీనిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రాగి పిండిని కొద్దిగా జార్ లోనే ఉంచి అందులోనే బెల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత తగిన మోతాదులో తీసుకుని పిండిని తీసుకుని లడ్డూల చుట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డూలు తయారవుతాయి. గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఈ లడ్డూలు నెలరోజుల వరకు తాజాగా ఉంటాయి. రోజుకు ఒక లడ్డూ చొప్పున తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా తయారవుతుంది.