Ravva Uthappam : మనం వివిధ రకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఒక్కోసారి మనకు ఇడ్లీపిండి, దోశ పిండి తయారు చేసుకుఎనేంత సమయం ఉండదు. అలాంటప్పుడుచాలా తక్కువ సమయంలో అయ్యేలా మనం రవ్వ ఊతప్పాన్ని తయారు చేసుకుని తినవచ్చు. రవ్వ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సలుభంగా రవ్వ ఊతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – అర కప్పు, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – తగినన్ని, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – తగినన్ని, క్యారెట్ తురుము – కొద్దిగా, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం ముక్కలు – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా.
రవ్వ ఊతప్పం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వను తీసుకోవాలి. తరువాత దానిలో ఉప్పు, జీలకర్ర, వంటసోడా, కరివేపాకు వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఊతప్పం వేసుకోవడానికి వీలుగా ఉండేలా తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని ఊతప్పం వేసుకోవాలి. దీనిపై ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను చల్లుకోవాలి.
తరువాత దీనిపై మరికొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఊతప్పాన్ని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత ఊతప్పాన్ని మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఊతప్పం రెండు వైపులా ఎర్రగా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ ఊతప్పం తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వ ఊతప్పలను తయారు చేసుకుని తినవచ్చు.