Kurkure Recipe : చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే.. క్షణ క్షణానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వారికి వంటలు చేసి పెట్టడం మాతృమూర్తులకు తలకు మించిన భారంగా మారుతుంది. అయినప్పటికీ వారు అడిగింది అడిగినట్లు చేస్తూనే ఉంటారు. అయితే బయట షాపుల్లో లభించే చిప్స్, కుర్ కురే లాంటివి కూడా కావాలని పిల్లలు అడుగుతుంటారు. కానీ బయట లభించేవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. కనుక ఇంట్లోనే వీటిని తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఇక పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుర్ కురేలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుర్ కురేలను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, మొక్కజొన్న పిండి – ఒక టేబుల్ స్పూన్, గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా – పావు టీస్పూన్, ఉప్పు – అర టీస్పూన్, నీళ్లు – 2 కప్పులు, వెన్న – ఒక టీస్పూన్, నూనె – వేయించేందుకు సరిపడా.
మసాలా కోసం కావల్సిన పదార్థాలు..
కారం – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, చాట్ మసాలా – అర టీస్పూన్, ఉప్పు – పావు టీస్పూన్, చక్కెర – ఒక టీస్పూన్.
కుర్ కురేలను తయారు చేసే విధానం..
మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో బియ్యం పిండి, శనగ పిండి, గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసి మరోసారి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం దగ్గరకు అవుతుంది. అప్పుడు వెన్న వేసి బాగా కలిపి స్టవ్‌ని ఆఫ్ చేయాలి. అయిదు నిమిషాలయ్యాక మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలపాలి. వేడి చల్లారాక చేతులకు నూనె రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని సన్నగా, పొడుగ్గా కుర్ కురే ఆకృతిలో చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే వీటిపైన చేసి పెట్టుకున్న మసాలా చల్లితే సరిపోతుంది. ఇవి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒకసారి చేసి పెట్టి పిల్లలకు తరచూ ఇవ్వవచ్చు. బయట వాటిని కొనకుండా ఇంట్లోనే చేసి ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఇక పెద్దలు కూడా వీటిని స్నాక్స్ రూపంలో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.