Constipation Remedy : మనల్ని వేధించే సర్వసాధారణమైన జీర్ణసంబంధిత సమస్యల్లో మలబద్దకం ఒకటి. ఈ సమస్య కారణంగా బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం, నీటిని ఎక్కువగా తాగకపోవడం, సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, మారుతున్న జీవన విధానం వంటి వాటిని మలబద్దకం సమస్య రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. మలబద్దకం సమస్యే కదా అని దీనిని తేలికగా తీసుకోకూడదు. దీని కారణంగా ఆకలి లేకపోవడం, ఫైల్స్, వికారంతో పాటు ఇతర జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇంటి చిట్కాను ఉపయోగించి మనం ఈ మలబద్దకం సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మలబద్దకాన్ని తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఈ నీళ్లు వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లో తీసుకోవాలి. ఈ నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆముదాన్ని వేసి బాగా కలపాలి.
తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, చిటికెడు బ్లాక్ సాల్ట్ ను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. అయితే ఈ పానీయాన్ని తీసుకోవడానికి అర గంట ముందు 2 గ్లాసుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఇలా గోరు వెచ్చని నీటిని తీసుకున్న అర గంట తరువాత ఈ మిశ్రమాన్ని తాగాలి. ఈ చిట్కాను పాటిస్తూ రోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేయాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల మలబద్దకంతో పాటు గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మలబద్దకంతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల ప్రేగుల కదలికలల్లో మార్పులు వచ్చి మల విసర్జన సాఫీగా జరుగుతుంది.