Pesara Pappu Chips : చిప్స్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. చిన్న పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. అయితే చిప్స్ అనగానే చాలా మంది బంగాళాదుంప చిప్స్ అనుకుంటారు. కానీ మనం పెసరపప్పుతో కూడా చిప్స్ చేసుకోవచ్చు. పెసరపప్పు చిప్స్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం.పెసరపప్పుతో చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన పెసరపప్పు – ఒక కప్పు, గోధుమ పిండి – రెండున్నర కప్పులు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నువ్వులు – ఒకటిన్నర టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
పెసర పప్పు చిప్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మూడు టీ టీ స్పూన్ల నూనె వేసి మరలా బాగా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని మందంగా చపాతీలా వత్తుకోవాలి. తరువాత చాకుతో కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత ఈ ముక్కలను నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు చిప్స్ తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఈ పెసరపప్పు చిప్స్ చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు.