Bhringraj Plant Benefits : ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయని మనకు తెలియదు. ఇలాంటి అనేక రకాల ఔషధ మొక్కల్లో గుంటగలగరాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. నీటి తడి ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. గుంటగలగరాకు మొక్క చూడడానికి చిన్నగా ఉన్నా దీనిలో ఉండే ఔషధ గుణాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఎంతో చక్కగా వివరించబడింది. గుంటగలగరాకులోని ఔషధ గుణాల గురించి దానిలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతలో భృంగరాజ్, కేశరాజ్ అని పిలుస్తారు. దీనిలో తెలుపు, నలుపు, పసుపు, నీలం రంగులు పువ్వులు పూసే వివిధ రకాలు ఉంటాయి.
శ్లేష్మ రోగాలకు, మేహ రోగాలకు, నేత్ర సంబంధిత సమస్యలకు, దంత సంబంధిత సమస్యలకు, చర్మ వ్యాధులకు, జుట్టు సంబంధిత సమస్యలను నివారించే అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. గంటగలగరాకును ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని మూడు చుక్కల మోతాదులో ముక్కుల్లో వేసుకున్నా లేదా తలకు రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఒక శుభ్రమైన తెల్లటి కాటన్ వస్త్రాన్ని ఈ ఆకు రసంలో నానబెట్టి ఎండలో ఆరబెట్టాలి. మరలా ఆకుల రసంలో నానబెట్టి మరలా ఎండలో ఆరబెట్టాలి. ఇలా ఏడు సార్లు చేసిన తరువాత ఈ వస్త్రాన్ని ముక్కలుగా చేసి వత్తులుగా చేసుకోవాలి. ఒక ప్రమిదలో ఈ ఒత్తిని ఉంచి నువ్వుల నూనె పోసి వెలిగించాలి. మంటపైన రాగి పాత్రను ఉంచి మంట నుండి వచ్చిన మసిని సేకరించాలి. తరువాత మసిలో ఆవు నెయ్యిని, కరిగించిన కర్పూరాన్ని వేసి కలపాలి.
దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుంటగలగరాకు కాటుక తయారవుతుంది. దీనిని రోజూ రాత్రి కళ్లల్లో పెట్టుకోవడం వల్ల కంట్లో పొరలు, కంటి శుక్లాలు, మసకలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకు రసాన్ని రెండు నుండి మూడు చుక్కల మోతాదులో ముక్కుల్లో వేసుకోవడం వల్ల తుమ్ములు, ముక్కు నుండి నీరు కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ ఆకు రసంలో సగం నీటిని కలిపి నోట్లో పోసుకుని రెండు పూటలా పుక్కిలించడం వల్ల నోటిపూత, నోటి పుండ్లు వంటి సమస్యలు తగ్గుతాయి. 10 గ్రాముల గుంటగలగరాకులో ఉప్పును వేసి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని మాత్రలుగా చేసుకుని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం వల్ల వచ్చే కడుపు నొప్పి, ఇతర కడుపు నొప్పులు కూడా తగ్గుతాయి. గుంటగలగరాకు సమూల చూర్ణాన్ని మూడు వేళ్లకు వచ్చినంత తీసుకుని నీటితో కలిపి రోజూ మింగుతూ ఉంటే కంటిచూపు పెరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.
రక్త శుద్ధి జరిగి చర్మ వ్యాధులు హరించుకుపోతాయి. కాలేయం, ప్లీహ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ గుంటగలగరాకును నేతిలో వేయించి గడ్డలపైన ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల గడ్డలు హరించుకుపోతాయి. తేలు కుట్టిన చోట ఆ మొక్క ఆకుల రసాన్ని పిండి పైన ఆముదాన్ని వేసి కట్టు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల తేలు విషం హరించుకుపోతుంది. 10 గ్రాముల గుంటగలగరాకు ఆకుల రసానికి, 20 గ్రాముల నువ్వుల నూనెను కలిపి బోధకాలుపై రాస్తూ ఉండడం వల్ల బోధకాలు వాపు తగ్గుతుంది. గుంటగలగరాకుకు సమానంగా అతి మధురం పొడిని కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమానికి ఆముదాన్ని కలిపి తలకు పట్టించాలి. ఎండిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు ఈ గుంటగలగర మొక్కలకు నమస్కరించి పూజ చేసి కావల్సినన్ని మొక్కలను వేర్లతో సహా సేకరించాలి.
తరువాత వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి గాలికి ఆరబెట్టాలి. తరువాత వీటిని పొడిగా చేసి వస్త్రంలో వేసి జల్లించి గాజు సీసాలో తీసుకోవాలి. తరువాత ఈ పొడి మునిగే వరకు అందులో గుంటగలగరాకుల రసాన్ని పోసి కలపాలి. దీనిని రాత్రంతా నానబెట్టి ఉదయం ఎండకు ఎండబెట్టాలి. మళ్లీ రాత్రి పూట గుంటగలరాకుల రసాన్ని పోసి నానబెట్టి ఉదయాన్నే ఎండబెట్టాలి. ఇలా 21 సార్లు చేయగా వచ్చిన పొడిని జల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని 80 గ్రాముల మోతాదులో తీసుకోవాలి.
దీనికి 40 గ్రాముల ఉసిరికాయ పొడిని, 20 గ్రాముల కానిక్కాయ పొడిని, 10 గ్రాముల కరక్కాయ పొడిని వేసి కలపాలి. ఈ మొత్తం పొడికి సమానంగా కండెచక్కెర పొడిని, తగినంత బాదం నూనెను కలిపి నూరి దంచి ముద్ద చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని రెండు పూటలా 5 గ్రాముల మోతాదులో తింటూ పాలు తాగుతూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అపారమైన రక్త శుద్ది జరిగి దేహకాంతి పెరుగుతుంది. దీర్ఘ యవ్వనంతో పాటు ఆయువు కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా గంటగలగరాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.