Mysore Bonda Recipe : మనం రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిలో మైసూర్ బోండా ఒకటి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు బయట టిఫిన్ సెంటర్లలో, హోటల్స్ లలో కూడా ఈ బోండాలు లభ్యవుతాయి. అచ్చం హోటల్స్ లో లభించే విధంగా రుచిగా ఉండే ఈ బోండాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడ వల్ల లోపల బోండాలు ఉడకడంతో పాటు మెత్తగా ఉంటాయి. హోటల్స్ లో లభించే విధంగా చక్కగా ఉండే మైసూర్ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ మైసూర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
తియ్యటి పెరుగు – ముప్పావు కప్పు, వంటసోడా – ఒకటింపావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, మైదా పిండి – 3 కప్పులు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు తరుగు – ఒక టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
హోటల్ స్టైల్ మైసూర్ బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత అందులో వంటసోడా వేసి కలపాలి. తరువాత జీలకర్ర, మైదాపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బోండా పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మరో 4 నుండి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత చేతులకు తడి చేసుకుంటూ పిండిని ఒక పక్క నుండి తీసుకుని బోండాలా వేసుకోవాలి.
తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న బోండాలను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల హోటల్ స్టైల్ లో ఉండే మైసూర్ బోండాలు తయారవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల బోండాల లోపల మెత్తగా ఉడకడంతో పాటు బాగా పొంగుతాయి. మనం తయారు చేసే బోండాలు గట్టిగా అయితే వంటసోడా తక్కువగా వేసినట్టు అర్థం. కనుక మరింత వంటసోడాను వేసి కలుపుకోవాలి. ఈ బోండాలను టమాట చట్నీ, పల్లి చట్నీ , సాంబార్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అప్పుడప్పుడూ ఈ విధంగా మైసూర్ బోండాలను తయారు చేసుకుని తినవచ్చు.