Vellulli : వెల్లుల్లి.. ఇది తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరి వంటగదిలో వెల్లుల్లి ఉంటుంది. దీనిని మనం విరివిరిగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిని వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మన ఆరోగ్య రక్షణలో కూడా వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైంది. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కనుక దీని నుండి ఘాటైన వాసన వస్తుంది. ఘాటైన వాసనను, రుచిని కలిగి ఉంటుందని దీనిని చాలా మంది ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ వెల్లుల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉదయం పూట పరగడుపున వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వెల్లుల్లిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
సహజ సిద్ద యాంటీ బయాటిక్ గా కూడా వెల్లుల్లి పని చేస్తుంది. దీనిని భోజనం చేసిన తరువాత కంటే పరగడుపున తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. పరగడుపున రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. అదేవిధంగా ఉబ్బసం, జ్వరం,నులిపురుగులు, కాలేయం, పిత్తాశయం వంటి సమస్యలకు వెల్లుల్లి దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ విధంగా పరగడుపున వెల్లుల్లిని తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు శరీరంలో నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. రక్తం గడ్డకుఏంటా నిరోధించే ఔషధ గుణాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. నరాల బలహీనతతో బాధపడే వారు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. వెల్లుల్లిని ఇలా పరగడుపున తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దీంతో ఎటువంటి ఇన్ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. వెల్లుల్లిని పరగడుపున తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచి తింటే దానిలో ఉండే ఔషధ గుణాలను, పోషకాలను మనం మరింత పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ వెల్లుల్లి తీసుకోకూడదు. ఈ విధంగా వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని పరగడుపున మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.