Boondi Laddu : తీపిని ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. అలాగే మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బూందీ లడ్డూలు కూడా ఒకటి. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ లడ్డూలు మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా లభ్యమవుతాయి. ఈ బూందీ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటి సారిగా చేసే వారు కూడా వీటిని సులువుగా తయారు చేసుకోవచ్చు. రుచిగా , సులభంగా బూందీ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బూందీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – పావు కిలో, పంచదార – పావు కిలో, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వేయించిన జీడిపప్పు – కొద్దిగా, వేయించిన ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు, ఫుడ్ కలర్ – చిటికెడు.
బూందీ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి దోశ పిండి కంటే కూడా పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక కళాయిలోనికని బూందీ గంటెను ఉంచి అందులో పిండిని వేసి చేత్తో కానీ గంటెతో కానీ పిండిని రుద్దాలి. తరువాత బూందీని గంటెతో కలుపుతూ అర నిమిషం పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో బూందీని తయారు చేసుకున్న తరువాత కళాయిలో పంచదార , ఒక గ్లాస్ నీళ్లు పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత దీనిని తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి.
పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న బూందీని వేసి కలపాలి. ఇందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత తగిన పరిమాణంలో బూందీని తీసుకుని లడ్డూలా వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 నుండి 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ విధంగా అప్పుడప్పుడూ బూందీ లడ్డూలను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు.