Beerakaya Pachadi : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం కూరగాయలను ఆహారంగా తీసుకుంటాం. మన ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ప ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అధిక బరువు, అజీర్తి, మలబద్దకం వంటి అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. బీరకాయలతో కూరలనే కాకుండా పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేయడవచ్చు. రుచిగా, కమ్మగా బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బీరకాయలు – పావు కిలో, పచ్చిమిర్చి – 8 లేదా తగినన్ని, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత, చింతపండు – 5 గ్రా., కొత్తిమీర – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బీరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా బీరకాయల పై పొట్టును తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి సగం వేగిన తరువాత పల్లీలు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బీరకాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే పసుపు, కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగించాలి. తరువాత మూత తీసి అందులో కొత్తిమీర వేసి బీరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా పోయే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో వేయించిన పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను, జీలకర్రను వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన బీరకాయ ముక్కలను, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింగు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసిన పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని రోట్లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. బీరకాయలతో ఎప్పుడూ కూరలనే కాకుండా ఇలా పచ్చళ్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు.