Coconut Water For Diabetics : కొబ్బరి నీళ్లు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొద్దిగా నీరసంగా ఉంటే చాలు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాం. అలాగే జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నప్పుడు, శరీరంలో వేడి చేసినప్పుడు కూడా మనం కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటాం. వైద్యులు కూడా కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తూ ఉంటారు. ఇలా ఏ జబ్బుకైనా సర్వరోగ నివారిణిగా పేరొందిన ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు. వీటిని మనం తరచూ తాగుతూనే ఉంటాం. కొబ్బరి నీళ్లల్లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. చర్మం పొడిబారకుండా చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు మనకు ఉపయోగపడతాయి. శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కూడా ఈ కొబ్బరి నీళ్లు మనకు దోహదపడతాయి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇలా కాలం ఏదైనా మనకు మేలు చేసే సహజ సిద్ద పానీయం కొబ్బరి నీళ్లు. అయితే సాధారణంగా కొబ్బరిలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొబ్బరి నీళ్లు తియ్యగా ఉంటాయి. దీనితో షుగర్ వ్యాధి గ్రస్తులు కొబ్బరి నీళ్లను తీసుకోవాలా వద్దా అని సందేహిస్తూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లల్లో నూనె ఉండదు. దీని వల్ల ఏవిధమైన నష్టం ఉండదు. కొబ్బరి నీళ్లల్లో ఎలోక్రోలైట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది.
ఈ నీళ్లల్లో చక్కెర నిల్వలు ఉన్నా షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొబ్బరి నీళ్లను అదే పనిగా తాగడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలు, పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. అలాగే వీటిని విపరీతంగా తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కొబ్బరి నీళ్లను అధికంగా కాకుండా అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా భయం లేకుండా కొబ్బరి నీళ్లను తాగి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.