Hair Growth Drink : వంటల తయారీలో కరివేపాకును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకు చక్కటి వాసనను కలిగి ఉంటుంది. దీనిని వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుంది. కానీ చాలా మంది కూరల్లో ఈ వేసే ఈ కరివేపాకును ఏరేస్తూ ఉంటారు. కానీ కరివేపాకులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకును ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులను వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో కరివేపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇవే కాకుండా జుట్టు సంరక్షణలో కూడా కరివేపాకు మనకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని, జుట్టు పొడి బారడాన్ని, చుండ్రు సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేయడంలో కరివేపాకు మనకు దోహదపడుతుంది. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కరివేపాకును ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ కరివేపాకును ఎలా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా మనం నాలుగు రెమ్మల కరివేపాకును తీసుకుని శుభ్రంగా కడగాలి.తరువాత ఉప్పు, పసుపు వేసిన నీటిలో వేసి పది నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఈ కరివేపాకును తీసుకుని ఒక జార్ లో వేసుకోవాలి.
తరువాత ఇందులో మూడు నుండి నాలుగు టీ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. తరువాత పావు టీ స్పూన్ జీలకర్రను, రుచికి తగినంత ఉప్పును, కొద్దిగా నీటిని పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక గ్లాస్ లోకి తీసుకుని గ్లాస్ నిండుగా నీటిని పోసుకోవాలి. తరువాత ఇందులో చిటికెడు పసుపును, చిటికెడు ఇంగువ వేసి కలిపి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను మన జుట్టుకు టానిక్ గా చెప్పవచ్చు. జుట్టుకు బయటి నుండి వివిధ రకాల హెయిర్ ప్యాక్స్ ద్వారా పోషణను అందించినప్పటికి ఇలా లోపలి నుండి పోషణను అందిస్తేనే జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల తెల్లగా మారిన జుట్టు కూడా నల్లగా మారుతుంది.
కరివేపాకుతో చేసిన ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మనం ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాత నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా కరివేపాకుతో చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల జుట్టు ధృడంగా, అందంగా పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.