Instant Punugulu : మనం సాయంత్రం పూట అనేక రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో పునుగులు కూడా ఒకటి. ఇవి మనకు బయట బండ్ల మీద కూడా లభిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీ పిండి ఉండాలే కానీ ఇన్ స్టాంట్ గా ఈ పునుగులను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా ఇడ్లీ పిండితో పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్థాంట్ పునుగులు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ పిండి – ఒక కప్పు, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. తరువాత అందులో మైదాపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని పోసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 30 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పునుగులుగా వేసుకోవాలి. ఈ పునుగులను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పునుగులు తయారవుతాయి.
వీటిని టమాట చట్నీ, పల్లి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా పునుగులను అప్పటికప్పుడు తయారు చేసుకుని తినవచ్చు. ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పునుగులను తయారు చేసుకుని తినవచ్చు.