Neyyi Appam : నెయ్యి అప్పం.. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. నెయ్యి అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటారు కూడా. బెల్లం వేసి చేసే ఈ అప్పాలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. ఈ నెయ్యి అప్పాలను రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి అప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 3 కప్పులు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నీళ్లు – పావు కప్పు, గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
నెయ్యి అప్పం తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని ఒక బట్టపై వేసి మూడు నుండి నాలుగు గంటెల పాటు ఆరబెట్టుకోవాలి. తరువాత వీటిని గిర్నిలో వేసి మెత్తగా పిండి పట్టించుకోవాలి. వీటిని జార్ లో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకుంటే మాత్రం పిండిని జల్లించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి, గోధుమపిండి, యాలకుల పొడి, వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉండే ఒక కళాయిని తీసుకుని అందులో కళాయికి పావు వంతు నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక లోతుగా ఉండే ఒక గంటెను తీసుకుని దానితో పిండిని తీసుకుని నూనెలో ఒకే దగ్గర అప్పంలా వేసుకోవాలి. ఒక నిమిషం వేడయ్యాక అప్పం పొంగుతుంది. అప్పుడు దీనిని అటూ ఇటూ తిప్పుకుంటూ కరకరలాడే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా గుంత కళాయి లేని వారు పునుగుల పెన్నాన్ని తీసుకుని అందులో నిండా నూనె పోసి కూడా ఈ అప్పాలను తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నెయ్యి అప్పం తయారవుతుంది. ఈ అప్పాలు రెండు నుండి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా ఈ అప్పాలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.