Tamilnadu Sweet Pongal : చాలా మంది శుభ కార్యాల సమయంలో పొంగలి వండుతుంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తీపి వెరైటీ కాగా.. ఇంకోటి కారంగా ఉంటుంది. సాధారణంగా పొంగలి అంటే చాలా మంది స్వీట్‌గానే చేస్తారు. అందులోనూ బెల్లం లేదా చక్కెరతో దీన్ని చేస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇక శుభ కార్యాలు లేని సమయంలోనూ పొంగలి వండుకుని తింటుంటారు. అయితే తమిళనాడులోనూ మనలాగే చాలా మంది పొంగలి వండుతారు. దాన్ని పొంగల్ అంటారు. ఈ క్రమంలోనే తమిళనాడు స్పెషల్ స్వీట్ పొంగల్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు స్పెషల్ స్వీట్ పొంగల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పెసర పప్పు – పావు కప్పు, బెల్లం – ఒక కప్పు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు, ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్, తినే కర్పూరం – చిటికెడు, యాలకుల పొడి – పావు టీస్పూన్, నెయ్యి – అర కప్పు, నీళ్లు – తగినన్ని.
తమిళనాడు స్పెషల్ స్వీట్ పొంగల్‌ను తయారు చేసే విధానం..
స్టవ్‌పై పాన్ పెట్టి పెసరపప్పును డ్రై రోస్ట్ చేయాలి. చల్లారిన తరువాత పప్పును శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి పప్పుతోపాటు కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత స్టవ్‌పై మళ్లీ పాన్ పెట్టి వేడి అయ్యాక బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. బెల్లం కరిగి చిక్కగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్‌లో ఉడికించుకున్న బియ్యం, పప్పును పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. తరువాత బెల్లం పానకం వేయాలి. యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై కాసేపు ఉడికించి దించుకోవాలి. స్టవ్‌పై మరో పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించాలి. ఈ జీడిపప్పును, ఎండుద్రాక్ష, తినే కర్పూరాన్ని పొంగల్‌లో కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ స్వీట్ పొంగల్ రెడీ అవుతుంది. దీన్ని ఒక్కసారి తింటే చాలు.. మళ్లీ మళ్లీ ఇలాగే కావాలంటారు. అందరూ ఇష్టంగా తింటారు.