Wheat Flour Biscuits : గోధుమ పిండితో మనం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమపిండిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గోధుమపిండితో చేసిన చపాతీ, పుల్కా వంటి వాటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ గోధుమపిండితో మనం బిస్కెట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్లు రుచిగా కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ గోధుమపిండితో బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, నెయ్యి – అర కప్పు, చిన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోధుమపిండి బిస్కెట్ల తయారీ విధానం..
ఈ బిస్కెట్లను తయారు చేసుకోవడానిక గానూ ముందుగా ఒక గిన్నెలో పంచదారను తీసుకోవాలి. తరువాత అందులో నీటిని పోసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. తరువాత అందులో నెయ్యి వేసి కలపాలి. తరువాత డ్రైఫ్రూట్స్, నువ్వులు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా గోధుమపిండిని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి అరగంట పాటు పిండిని నాననివ్వాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని చపాతీలా రుద్దుకోవాలి. తరువాత ఈ చపాతీని వీలైనన్ని మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మరలా అర ఇంచు మందంతో చపాతీలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తరువాత బాటిల్ మూతను తీసుకుని గుండ్రంగా బిస్కెట్ల ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక బిస్కెట్లను వేసుకుని కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లు తయారవుతాయి. ఈ బిస్కెట్లు 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. బయట లభించే మైదా పిండి బిస్కెట్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే గోధుమపిండితో బిస్కెట్లను చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.