Allam Tea : మన వంటగదిలో తప్పకుండా ఉండాల్సిన పదార్థాల్లో అల్లం ఒకటి. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. వంటల్లో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అల్లాన్ని ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వంటల్లో ఉపయోగించడంతో పాటు ఈ అల్లంతో మనం ఎంతో రుచిగా ఉండే టీ ని కూడా తయారు చేస్తూ ఉంటాం. అల్లం టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. ఈ అల్లం రుచిగా, కమ్మగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 2 టీ గ్లాసులు, టీ పౌడర్ – 2 టీ స్పూన్స్, యాలకులు – 2, పాత అల్లం – ఒక ఇంచు ముక్క, పాలు – 2 టీ గ్లాస్లులు, పంచదార – 3 టీ స్పూన్స్ లేదా తగినంత.
అల్లం టీ తయారీ విధానం..
ముందుగా యాలకులను, అల్లాన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక దంచుకున్న అల్లం, యాలకులు వేసి రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు మరిగించిన తరువాత టీ పౌడర్ ను వేసుకోవాలి. ఈ టీ ని కలుపుతూ ఒక నిమిషం పాటు మరిగించాలి. తరువాత పాలు పోసి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీని వడకట్టి కప్పులోకి లేదా గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం టీ తయారవుతుంది. వేడి వేడి గా ఈ టీని తాగుతూ ఉంటే శారీరక బడలిక తగ్గడంతో పాటు మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన, తలనొప్పి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.