Walking : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే.. కొందరికి కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది వారు పాటిస్తున్న అస్తవ్యవస్తమైన జీవనవిధానం వల్లే అనేక రోగాల బారిన పడుతున్నారు. అలాగే వ్యాధులు వచ్చేందుకు ఇంకా అనేక కారణాలు కూడా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు వ్యాయామం చేస్తున్నారు. ఇక చాలా మంది రోజూ చేస్తున్న సాధారణ వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒకటి.
వాకింగ్ చేసేందుకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఖర్చు కూడా ఉండదు. ఎవరైనా ఏ సమయంలో అయినా సరే వాకింగ్ చేయవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా సరే ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. షుగర్ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇంకా వాకింగ్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొందరు భోజనం చేసిన తరువాత మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో.. తిన్న వెంటనే వాకింగ్ చేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం మంచిదేనా.. దీని వల్ల ఏం జరుగుతుంది.. అని కూడా చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా సరే భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయరాదు. ఎందుకంటే తిన్న వెంటనే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు రక్తం ఎక్కువగా జీర్ణవ్యవస్థ వైపు వస్తుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం ఉండదు. అయితే తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల రక్తం జీర్ణవ్యవస్థ వైపు వెళ్లదు. శరీరంలోని ఇతర భాగాలకు వెళ్తుంది. ఎందుకంటే వాకింగ్ చేసే సమయంలో శరీర భాగాలకు ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందువల్ల రక్తం జీర్ణవ్యవస్థ వైపు కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు చేరుతుంది. ఇక ఆ సమయంలో మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు రక్తం ఉండదు. కనుక జీర్ణవ్యవస్థ పనులకు ఆటంకం కలుగుతుంది. దీంతో తిన్న ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కనుక తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. కనీసం 1 గంట పాటు వేచి ఉండాలి. తరువాతే వాకింగ్ చేయాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కనుక తిన్న వెంటనే వాకింగ్ చేయకుండా కాసేపు ఆగండి. తరువాతే నడవండి. దీంతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. లేదంటే ఇబ్బందులు తప్పవు.