Ash Gourd Juice : నారింజ రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే గుమ్మడికాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. గుమ్మడికాయలతో అనేక మంది రకరకాల వంటలను చేస్తుంటారు. వీటిని బెల్లంతో కలిపి కూరలా వండుతారు. దాన్ని నేరుగా తినవచ్చు. గుమ్మడికాయలను ఒడియాలుగా కూడా పెట్టుకుంటారు. అయితే గుమ్మడికాయల్లో మనకు రెండు రకాలు లభిస్తాయి. ఒకటి సాధారణ గుమ్మడికాయలు కాగా.. రెండో రకంవి బూడిద గుమ్మడికాయలు. సాధారణ గుమ్మడికాయలను మనం తింటాం. కానీ బూడిద గుమ్మడికాయలను దిష్టి తీసేందుకు, గుమ్మానికి కట్టేందుకు వాడుతారు. అయితే వాస్తవానికి బూడిద గుమ్మడి కాయలను కూడా మనం తినవచ్చు. వీటితోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
బూడిద గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వీటిని నేరుగా తినలేమని అనుకునేవారు జ్యూస్ చేసి తాగవచ్చు. ఒక కప్పు లేదా ఒక గ్లాస్ మోతాదులో బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం తాగవచ్చు. లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బూడిద గుమ్మడికాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, జింక్, కాల్షియం, ఐరన్, విటమిన్లు బి1, బి3, బి2, సి, బి6, బి5.. వంటి అనేక పోషకాలు వీటిల్లో ఉంటాయి. అందువల్ల ఈ జ్యూస్‌ను తాగితే మనకు అన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. బూడిద గుమ్మడికాయల్లో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అలాగే ఈ జ్యూస్‌లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. దీంట్లో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేందుకు తోడ్పడుతుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు జరుగుతుంది. పొట్టలో ఉండే అల్సర్లు తగ్గుతాయి. కడుపులో మంట, నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రావు. వైరస్‌లు, బాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది. కనుక బూడిద గుమ్మడికాయలను లైట్ తీసుకోవద్దు. వీటి జ్యూస్‌ను తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.