Tomatoes : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే అప్పుడప్పుడు ధర కాస్త ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ టమాటాలు లేకుండా కూర చేయరు. వీటిని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇక టమాటాలతో నేరుగా వంటలను కూడా చేస్తుంటారు. టమాటా పప్పు, పచ్చడి, రసం.. ఇలా చేసి తింటుంటారు. అయితే టమాటాలను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. టమాటాలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే బీపీ పెరగదు. నియంత్రణలోకి వస్తుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది.
టమాటాలలో లుటీన్, లైకోపీన్ వంటి కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లను సంరక్షిస్తాయి. కంటి సమస్యలను తగ్గిస్తాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలను రాకుండా కళ్లను కాపాడుతాయి. అలాగే టమాటాలను తినడం వల్ల రక్తం కూడా అధికంగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. అయితే టమాటాలను పచ్చిగా లేదా వండుకుని కూడా తినవచ్చు. వండుకుని తింటే యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం పెరుగుతుంది. పచ్చిగా తింటే విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఎలా తిన్నా కూడా టమాటాల వల్ల మనకు లాభాలే కలుగుతాయి. అయితే టమాటాలను పచ్చిగా తింటే మాత్రం కచ్చితంగా బాగా కడగాల్సిందే. లేదంటే పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. అవి మన శరీరంలోకి ప్రవేశించి మనకు హాని చేస్తాయి. కనుక పచ్చి టమాటాలను తినే వారు వాటిని బాగా కడగాల్సి ఉంటుంది.
టమాటాలను పచ్చిగా తినదలిస్తే వాటిని ఒక పాత్రలోకి తీసుకుని అందులో నీళ్లను పోసి కాస్త ఉప్పు వేసి బాగా కడగాలి. ఆ తరువాతే వాటిని తినాలి. అలాగే టమాటాలను ఉడికించినా.. పచ్చిగా తిన్నా.. వాటిని ఎక్కువ మొత్తంలో మాత్రం తినరాదు. తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. టమాటాలను అధికంగా తినడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే నోరు, గొంతు సమస్యలు, వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక టమాటాలను పచ్చిగా లేదా ఉడకబెట్టి.. ఎలా తిన్నా సరే రోజుకు 50 నుంచి 70 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక టమాటాలను తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ పొరపాట్లను మాత్రం చేయరాదు.