Karam Gavvalu : మనం పండుగలకు రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకునే పిండి వంటల్లో గవ్వలు కూడా ఒకటి. గవ్వలు చాలా రుచిగా ఉంటాయి. మనం ఎక్కువగా పంచదారతో ఈ గవ్వలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం పంచదార గవ్వలే కాకుండా మనం కారం గవ్వలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారం గవ్వలు కూడా చాలా రుచిగా ఉంటాయి. తీపి రుచిని ఎక్కువగా ఇష్టపడని వారుఈ కారం గవ్వలను తయారు చేసుకుని తినవచ్చు. రుచిగా, గుల్ల గుల్లగా ఉండేలా ఈ కారం గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కారం గవ్వల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – రెండు కప్పులు, బొంబాయి రవ్వ – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, వేడి నూనె – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, కరివేపాకు – రెండు రెమ్మలు.
కారం గవ్వల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బొంబాయి రవ్వ, కారం, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ గవ్వల చెక్కపై గవ్వల ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వత్తుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గవ్వలను వేసి వేయించాలి. వీటిని నూనెలో వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ కదుపుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకున్న తరువాత అదే నూనెలో కరివేపాకును వేసి వేయించి గవ్వలపై వేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం గవ్వలు తయారవుతాయి. వీటిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా మరికొద్దిగా ఉప్పు, కారం, నూనె వాటిపై చల్లుకుని కూడా తినవచ్చు. తరచూ పంచదార గవ్వలే కాకుండా ఇలా కారం గవ్వలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ గవ్వలు చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పండుగలకు లేదా స్నాక్స్ గా ఇలా కారం గవ్వలను తయారు చేసుకుని తినవచ్చు. అలాగే వీటిని గోధుమపిండితో తయారు చేస్తున్నాం కనుక వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎక్కువగా హాని కలగకుండా ఉంటుంది.