Minapa Pottu Vadiyalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినప పొట్టు కూడా ఒకటి. మినప పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మినపప్పుతో పాటు మనం పొట్టు మినపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పొట్టు మినపప్పును కడిగినప్పుడు వంచిన పొట్టును మనం పడేస్తూ ఉంటాం. కానీ ఈ పొట్టుతో మనం వడియాలను కూడా తయారు చేసుకోవచ్చు. మినప పొట్టుతో చేసే ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మినప పొట్టుతో ఎంతో రుచిగా ఉండే వడియాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్తాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినప పొట్టు వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పొట్టు – 3 గ్లాసులు, మెత్తగా మిక్సీ పట్టుకున్న మినప పిండి – ఒక గ్లాస్, పచ్చిమిర్చి – 6 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, నువ్వులు – 4 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మినప పొట్టు వడియాల తయారీ విధానం..
ముందుగా మినప పొట్టును రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని నీళ్లు లేకుండా గట్టిగా చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని మినప పొట్టులో వేసుకోవాలి. తరువాత ఇందులో మినపిండి, ఉప్పు, నువ్వులు వేసి బాగా కలపాలి. తరువాత ఈ పిండిని కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ ప్లాస్టిక్ కవర్ మీద వడియాల లాగా పెట్టుకోవాలి. ఈ వడియాలను ఎండలో ఒక రోజంతా ఎండబెట్టాలి. తరువాత మరుసటి వాటిని మరో వైపుకు తిప్పుకుని ఎండబెట్టుకోవాలి. వీటిని మరో రెండు రోజుల పాటు ఎండబెట్టుకుని బాగా ఎండిన తరువాత డబ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మినప పొట్టు వడియాలు తయారవుతాయి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినప పొట్టు వడియాలను వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినప పొట్టు వడియాలు తయారవుతాయి. ఈ వడియాలను అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. మినప పొట్టు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పొట్టు మినపప్పును కడిగినప్పుడు పొట్టును నిల్వ చేసుకుని కూడా ఈ వడియాలను తయారు చేసుకోవచ్చు.