Alasanda Vadalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. వీటిని చాలా మంది మొలకల రూపంలో తీసుకుంటారు. అలాగే కూరగా కూడా వండుకుని తింటారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అలసందలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ అలసందలతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. అలసందలతో చేసిన వడలు అచ్చం మసాలా వడల లాగా రుచిగా ఉంటాయి. అలసంద వడలను తయారు చేయడం చాలా తేలిక. అలసందలతో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అలసంద వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
అలసందలు – 350 గ్రా., నీళ్లు – తగినన్ని, పచ్చిమిర్చి – 6, అల్లం – 2 ఇంచుల ముక్క, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అలసంద వడల తయారీ విధానం..
ముందుగా అలసందలను ఒక గిన్నెలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న వడలను వేసి కాల్చుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అలసంద వడలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అలసందలతో ఈ విధంగా తయారు చేసిన వడలను అందరూ ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో బయట లభించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే అలసంద వడలను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి నష్టం కలగకుండా ఉంటుంది.