Aloo Vankaya Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసిన వంటకాలను అందరూ ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంపలతో ఇతర కూరగాయలను కూడా కలిపి వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా చాలా సులభంగా తయారు చేసుకోగలిగే ఆలూ వంకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, చిన్న ముక్కలుగా తరిగిన వంకాయలు – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1( పెద్దది), తరిగిన పచ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, కారం – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, దాల్చిన చెక్క పొడి – పావు టీ స్పూన్, లవంగాల పొడి – పావు టీ స్పూన్.
ఆలూ వంకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. వంకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత ఇందులో బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా బాగా కలుపుకుని దానిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు చిన్న మంటపై మగ్గించాలి.
తరువాత కొత్తిమీర, దాల్చిన చెక్కపొడి, లవంగాల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఆలూ వంకాయ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.