Egg Breakfast : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కోడిగుడ్డును ఇష్టంగా తింటారు. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా కోడిగుడ్లతో ఒక రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 3, బంగాళాదుంపలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, మైదా పిండి – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నూనె – తగినంత.
ఎగ్ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసి చిన్నగా తరుముకోవాలి. తరువాత ఈ బంగాళాదుంప తురుమును నీటిలో వేసి రెండు సార్లు బాగా కడగాలి. తరువాత దీనిని నీళ్లు లేకుండా చేత్తో గట్టిగా పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసిన కోడిగుడ్డు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. వీటిని నూనె వేసుకుంటూ చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా టమాట కిచప్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని స్నాక్స్ గా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఏదైనా కొత్త వంటకాన్ని తయారు చేయాలనిపించినప్పుడు లేదా ఉదయం పూట అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎంతో రుచిగా కోడిగుడ్లతో ఈ విధంగా రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని తినవచ్చు.