Moong Dal Soup : మనం తరచూ వివిధ రకాల కూరగాయలను పప్పుతో కలిపి వండుతుంటాం. చాలా మంది కందిపప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే పెసరపప్పు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పు వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. కానీ పెసర పప్పు ఇందుకు విరుద్ధంగా పనిచేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కనుకనే పత్యం చేసేవారికి, జ్వరం వచ్చిన వారికి కూడా పెసరపప్పుతో చేసిన వంటలను పెట్టమని వైద్యులు సైతం సూచిస్తుంటారు. అయితే పెసరపప్పును కూరగాయలతో కలిపి మాత్రమే కాకుండా.. దాంతో ఎంచక్కా సూప్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఓ వైపు శక్తిని అందిస్తూనే మరో వైపు పోషకాలను కూడా ఇస్తుంది. ఇక పెసరపప్పుతో సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – పావు కప్పు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, తురిమిన అల్లం – అర టేబుల్ స్పూన్, క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు – అర కప్పు, మిరియాలు – పావు కప్పు, అల్లం పొడి – చిటికెడు, వాము – చిటికెడు, ఉప్పు – కొద్దిగా, మెంతి కూర – కొద్దిగా.
పెసర పప్పు సూప్‌ను తయారు చేసే విధానం..
ముందుగా పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత అందులోని నీటిని వంపేయాలి. ఇప్పుడు స్టవ్‌పై కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో జీలకర్ర, తురిమిన అల్లం వేయాలి. అనంతరం పెసరపప్పుని వేసి వేయించాలి. తరువాత అందులో క్యారెట్, గుమ్మడికాయ ముక్కలని వేసి బాగా కలపాలి. ఆ తరువాత అందులో కాస్త నీళ్ళని పోసి మరోసారి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. అనంతరం స్టవ్‌ని సన్నని మంటపై ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అయితే సూప్ మెత్తగా రావాలంటే ఇంకా ఎక్కువ సేపు ఉడికించాలి.
ఇలా ఉడికిన అనంతరం అందులో మిరియాలు, వాము, ఉప్పు, అల్లం పొడి వేసి బాగా కలపాలి. తరువాత దానిపై మెంతి కూరను వేసి గార్నిష్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన పెసర పప్పు సూప్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు ఇలా పెసరపప్పుతో సూప్‌ను తయారు చేసి తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకుంటారు. ఇలా మనకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. కనుక దీన్ని తరచూ తీసుకోవాలి.