Masala Vadalu : మనం సాయంత్రం పూట రకరకాల చిరుతిళ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనకు రోడ్ల పక్కన బండ్ల మీద అనేక రకాల చిరుతిళ్లు లభిస్తూ ఉంటాయి. వాటిల్లో మసాలా వడలు కూడా ఒకటి. ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వడలను ఇష్టంగా తింటారు. బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ వడలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎవరైనా వీటిని తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, చక్కగా మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – ఒక కట్ట ( చిన్నది), తరిగిన పుదీనా – ఒక కట్ట ( చిన్నది), తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మసాలా వడల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి శనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు చక్కగా నానిన తరువాత వాటిని పూర్తిగా నీళ్లు లేకుండా నానబెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ శనగపప్పులో గుప్పెడు శనగపప్పును తీసుకుని పక్కకు పెట్టుకుని మిగిలిన శనగపప్పును జార్ లోకి తీసుకోవాలి. ఈ శనగపప్పును మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో పక్కకు పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్, పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఈ వడలను అందరూ ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో అప్పుడప్పుడూ ఇలా మసాలా వడలను తయారు చేసుకుని తినవచ్చు.