రోజూ ప్రతి ఒక్కరు తమ శరీర అవసరాలకు తగినట్లుగా కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. రోజూ తగినంత నిద్ర పోవడం కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుతం నిద్ర లేమి సమస్య చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను రాత్రి భోజనంలో తీసుకోవాలి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. చెర్రీలలో మెలటోనిన్ సహజసిద్ధంగా లభిస్తుంది. ఇది చక్కగా నిద్ర పట్టేలా చేస్తుంది. చెర్రీ పండ్లలో ప్రోసయనైడిన్స్, ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి నిద్రకు ముందు లేదా భోజనంలో చెర్రీ పండ్లను తిన్నా లేదా చెర్రీ పండ్ల జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది. దీని వల్ల డిప్రెషన్, ఒత్తిడి కూడా తగ్గుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తినరాదు.
2. అధిక బరువు తగ్గేందుకు కోడిగుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కోడిగుడ్లలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నాచురల్ సెడేటివ్‌గా పనిచేస్తుంది. అంటే నిద్ర బాగా పట్టేలా చేస్తుందన్నమాట. కోడిగుడ్లను ఉడకబెట్టి రాత్రి ఆహారంలో తీసుకోవాలి. దీంతో త్వరగా నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
3. పెరుగులోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల నిద్ర బాగా పట్టేందుకు పెరుగు కూడా ఉపయోగపడుతుంది. సులభంగా జీర్ణమవుతుంది. అయితే శ్లేష్మం ఎక్కువగా తయారయ్యే వారు రాత్రి పూట పెరుగు తినడం మానేయాలి.
4. కమోమిల్ (గడ్డి చామంతి) పువ్వుల టీని రాత్రి పూట తాగినా నిద్ర బాగా పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో వాల్ నట్స్ బాగా పనిచేస్తాయి. వీటిని రాత్రి పూట తీసుకుంటే మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
6. రాత్రి పూట ఓట్ మీల్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. విటమిన్ డి, బి3 వంటి పోషకాలు అందుతాయి.
7. రాత్రి పూట పాలలో తేనె కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. ఎముకలు దృఢంగా మారుతాయి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
8. బాదంపప్పును కూడా రాత్రి పూట తినవచ్చు. వీటి ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ప్రోటీన్లు, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు అందుతాయి.
9. రాత్రిపూట ఆహారంలో అరటి పండ్లను కూడా తీసుకోవచ్చు. వీటి ద్వారా పొటాషియం, మెగ్నిషియం, బి విటమిన్లు లభిస్తాయి. కండరాలు, నాడులు ప్రశాంతంగా మారుతాయి. శరీరం రిలాక్స్ అవుతుంది. అలసట తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365