Aloo Green Chilli Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని పచ్చిగా తీసుకోవడం కంటే ఉడికించి తీసుకోవడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలతో కూడా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉడికించిన బంగాళాదుంపలతో రుచిగా ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3, పచ్చిమిర్చి – 5, అల్లం – 2 ఇంచుల ముక్క, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, అల్లం వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పసుపు, ఉప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తరువాత బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత వాటిని గంటెతో కొద్దిగా మెత్తగా వత్తుకుంటూ కలుపుకోవాలి.
తరువాత వీటిపై మూతను ఉంచి 5 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా వండుకుని తినవచ్చు. ఈ విధంగా పచ్చికారం వేసి చేసిన బంగాళాదుంప ఫ్రైను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.