Tomato Garlic Chutney : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది టమాట పచ్చడిని ఇష్టంగా తింటారు. అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో నిల్వ పచ్చళ్లే కాకుండా అప్పటికప్పుడు కూడా ఎంతో రుచిగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి వేసి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. వెల్లుల్లి వేసి రుచిగా టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట వెల్లుల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – అరకిలో, ఎండుమిర్చి – 10, వెల్లుల్లి రెబ్బలు – 10, చింతపండు – చిన్న నిమ్మకాయంత, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్.
టమాట వెల్లుల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు వేగిన తరువాత ధనియాలు వేసి వేయించాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో టమాట ముక్కలు, ఉప్పు, చింతపండు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉడికించిన టమాట వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట వెల్లుల్లి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఈ విధంగా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే టమాట వెల్లుల్లి పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.