భార్యభర్తల మధ్య గొడవలు రావటం సహజం. మాటమాట అనుకోవటం సహజం. కానీ, వివాదం వచ్చినప్పుడు నాదే పైచేయి కావాలన్న పట్టుదల ఉంటే, బంధం నిలవటం కష్టమవుతుంది. భార్యభర్తల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు, భార్యను అనరాని మాటలతో, సూటిపోటి మాటలు అని ఆమె మనస్సును గాయాలయ్యేలా మాట్లాడుతారు. తరువాత పర్యవసనాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించరు. మాట జారితే వెనక్కి తీసుకోలేమని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భర్తదే ఎప్పుడూ పైచేయి ఉండాలని కోరుకోవటం, పురషాహంకారం ఇటువంటి సమయాల్లోనే మేల్కొవటం జరుగుతుంది కాబట్టి, భార్య మనస్సును నొప్పిస్తారు. తరువాత మీరు క్షమించమని అడిగినా, సారీ అని ప్రాథేయపడినా, ఆమె మనస్సుకు అయిన గాయాన్ని మాన్పలేరు. కాబట్టి, వాదనలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకొని మాట్లాడాలని తెలుసుకోండి.
భార్యభర్తల మధ్య గొడవలు రావటం సహజమని గుర్తుపెట్టుకోవాలి. పంతానికి పోయి.. శత్రువులుగా భావించకండి. వాదనలో ఉన్నప్పుడు భార్యను పరుష పదజాలంతో నిందించవద్దు. చిన్నచిన్న తగాదాలనే పెద్దగా మార్చుకోవద్దు. తప్పు ఇద్దరిలో ఎవరిదైనా సారీ అన్న చిన్నమాటతో, గొడవను తెంచేయండి.. ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుకోండి. కొన్నిసార్లు చిన్నచిన్న గొడవలే విడిపోవటానికి కారణాలు అవుతాయని గుర్తుంచుకోండి. వివాదాన్ని సాధ్యమైనంత మేరకు సద్దుమణేగేలా చూడటానికే ట్రై చేయండి. ఇంటికి బంధువులు వచ్చినప్పుడో, లేదా మీ ఆఫీస్ నుంచో, మీ స్నేహితులనో ఇంటికి తీసుకువచ్చినప్పుడు భార్యను కించపరచేలా మాట్లాడకండి. ఏమీ చేతకాదు.. అన్నీ నేనే చెప్పాలి.. నేను లేకపోతే పని చేతకాదు, పుట్టింట్లో ఏం నేర్పారో కూడా తెలియదు అంటూ అవమానించకండి. నేను లేకపోతే అస్సలు ఒక్కపని కూడా జరగదని అందరి ముందూ భార్యను తక్కువ చేయకండి. ఇది ఆమె మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు.
కొందరైతే, బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ ఉన్నారని మరీ రెచ్చిపోయి, తన ఆధిపత్యాన్ని చూపించుకోవటానికి భార్య తప్పులేకున్నా తిడుతుంటారు. భార్య చులకన అయితే, మీరు కూడా చులకన అయిపోతారనీ, మీకు కనీస మర్యాద ఇవ్వరని గుర్తించుకోండి. మీ భార్య హౌస్ వైఫ్ అయితే, ఆమె పనులు ఆఫీసులో కంటే ఇంట్లోనే ఎక్కువ ఉంటాయని అర్థం చేసుకోండి. ఏపనీ చేయటం లేదంటూ చులకనగా మాట్లాడకండి. వివాదాల్లో భర్తలు భార్య వల్ల రూపాయి ఉపయోగం లేదనీ, నా జీతంతోనే ఇల్లు నడుస్తోందంటూ గొప్పలకు పోతుంటారు. కానీ ఆమె అహిర్నిశలు ఇంట్లో కష్టపడటం వల్లే ఇల్లు సవ్యంగా ఉందని ఆమె కష్టాన్ని కూడా గుర్తించండి. వివాదంలో ఎవరు ఓడినా ఇద్దరూ ఓడినట్లేనని గుర్తించుకోండి.