Gongura Shanagapappu : మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలను కలిగిన ఆహారాల్లో గోంగూర ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ గోంగూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గోంగూరతో పప్పు, పచ్చడే కాకుండా శనగపప్పు వేసి కూర కూడా చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చేయడం చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, సులభంగా గోంగూర శనగపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర శనగపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 3 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), పొడుగ్గా తరిగిన టమాటాలు – 2, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, నానబెట్టిన శనగపప్పు – ముప్పావు కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
గోంగూర శనగపప్పు కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో శుబ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. తరువాత ఇందులో శనగపప్పు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి గోంగూరను ఉడికించాలి. గోంగూర కొద్దిగా దగ్గర పడిన తరువాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో గంటెతో కలుపుతూ శనగపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. శనగపప్పు ఉడికిన తరువాత మూత తీసి నీరంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత ఉడికించిన గోంగూర, శనగపప్పు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర శనగపప్పు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా శనగపప్పు కూడా వేసి తయారు చేసుకోవచ్చు. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.