Maddur Vada : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. బియ్యం పిండితో చేసుకోదగిన వంటకాల్లో మద్దూర్ వడ కూడా ఒకటి. కర్ణాటక స్పెషల్ వంటకమైనా ఈమద్దూర్ వడ చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ మద్దూర్ వడ చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే మద్దూర్ వడను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మద్దూర్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక టీ గ్లాస్, మైదా పిండి – ఒక టీ గ్లాస్, బొంబాయి రవ్వ – అర టీ గ్లాస్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నువ్వులు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, వేడి చేసిన నూనె – పావు టీ గ్లాస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మద్దూర్ వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత నూనెను వేడి చేసి వేసుకుని అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఉండలు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పాలిథిన్ కవర్ లేదా అరటి ఆకు, బటర్ పేపర్ మీద నూనె రాసి ఒక్కో ఉండను తీసుకుంటూ చేత్తో వత్తుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ ఈ ఉండలను మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా చెక్క అప్పలాగా వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని వడలను వేసి కాల్చుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కాలి పైకి తేలిన తరువాత కదపాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మద్దూర్ వడ తయారవుతుంది. వీటిని కొబ్బరి చట్నీ, టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ మద్దూర్ వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.