Radish For Diabetes : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ముల్లంగి కూడా మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తుంది. కానీ దీని వాసన కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. ముల్లంగితో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని సలాడ్ రూపంలో పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ముల్లంగిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, జింక్, క్యాల్షియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అలాగే ఫైబర్ కూడా దీనిలో సమృద్ధిగా ఉంటుంది. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముల్లంగిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ తో బాధపడే వారు ముల్లంగిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముల్లంగి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు ముల్లంగిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముల్లంగిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే విధంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు ముల్లంగిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కామెర్ల వ్యాధిని తగ్గించడంలో, చర్మాన్ని సంరక్షించడంలో కూడా ముల్లంగి మనకు దోహదపడుతుంది. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ముల్లంగిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఆస్ట్రియో పోరోసిస్, కీళ్లు నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చని వీటిని కూడా ఇతర కూరగాయల వలె ఆహారంగా భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.