Mutton Pulao In Pressure Cooker : మాంసాహార ప్రియులకు మటన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మటన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మటన్ తో చేసుకోదగిన వంటకాల్లో మటన్ పులావ్ కూడా ఒకటి. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ పులావ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ లలో ఈ పులావ్ మనకు ఎక్కువగా లభిస్తుంది. రెస్టారెంట్ రుచి వచ్చేలా దీనిని ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ లో వేసి చేసే ఈ పులావ్ ను బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటి సారి చేసే వారు ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ లో రుచిగా, సులభంగా, త్వరగా ఈ మటన్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, జాపత్రి – 1, అనాస పువ్వు – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – పావు కప్పు, తరిగిన పుదీనా – పావు కప్పు, నీళ్లు – 350 ఎమ్ ఎల్, గంటపాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర కప్పుచ రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన మటన్ – అరకిలో, పెరుగు – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – అర టీ స్పూన్, సోంపు గింజలు- ఒక టీ స్పూన్, లవంగాలు – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, యాలకులు – 3, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, ఎండుమిర్చి – 6, ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు.
మటన్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మటన్ ను తీసుకోవాలి. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. మసాలా దినుసులు చక్కగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగంకు పైగా వేగిన తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత కారం, కొత్తిమీర, పుదీనా, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి కలపాలి. దీనిపై మరలా మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పై మూత తీయకుండా 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తరువాత మూత తీసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెప్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇలా చాలా సులభంగా ఇంట్లోనే మటన్ పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.