Appadalu : మనం సాంబార్, రసం వంటి వాటితో అప్పడాలను కూడా కలిపి తింటూ ఉంటాం. సాంబార్, పప్పు వంటి వాటితో అప్పడాలను కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం బయట ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా అలాగే ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే అప్పడాలను మనం తయారు చేసుకోవచ్చు. ఎండబెట్టే అవసరం లేకుండా అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ముప్పావు కప్పు, శనగపిండి – ఒక కప్పు, చిల్లీ ప్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కచ్చా పచ్చా దంచిన వాము – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అప్పడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకోవాలి. తరువాత దీనిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత పప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనెతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఈ అప్పడాల పిండిని చపాతీ పిండిలా గట్టిగా వత్తుకున్న తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా చపాతీ కర్రతో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అప్పడాలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే అప్పడాలు తయారవుతాయి. వీటిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని స్నాక్స్ గా కూడా తినవచ్చు.