Mushroom Pulao : పుట్ట గొడుగులను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పుట్ట గొడుగుల్లో మనకు కావల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, చేల గట్లపై ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అయితే మార్కెట్‌లలోనూ వీటిని విక్రయిస్తుంటారు. పుట్ట గొడుగులను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని కూరగా చేసుకుని అన్నం లేదా చపాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే పుట్ట గొడుగులతో ఎంతో టేస్టీగా ఉండే పులావ్‌ను కూడా చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పుట్ట గొడుగుల పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్ట గొడుగుల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – పావు కిలో, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు – 2, యాలకులు – 1, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ఉల్లిపాయలు – 2, వెల్లుల్లి రెబ్బలు – 5, అల్లం – అంగుళం ముక్క, మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, బటన్ పుట్ట గొడుగులు – పావు కిలో.
పుట్ట గొడుగుల పులావ్‌ను తయారు చేసే విధానం..
బియ్యం కడిగి నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లం, మిరియాలు తగినన్ని నీళ్లు పోసి మెత్తని ముద్దలా రుబ్బాలి. ప్రెషర్ పాన్‌లో నెయ్యి వేసి కాగాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక రుబ్బిన మసాలా ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు కోసిన పుట్ట గొడుగు ముక్కలు వేసి 10 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత కడిగి వడబోసి ఉంచిన బియ్యం, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మూత తీశాక ఒకసారి కలిపి వడ్డించాలి. దీంతో ఎంతో రుచికరమైన పుట్ట గొడుగుల పులావ్‌ను తిని ఆస్వాదించవచ్చు. చికెన్, మటన్ కాకుండా ఈసారి వెరైటీగా పుట్ట గొడుగులతో పులావ్ ను చేసి తినండి. అందరూ ఇష్టపడతారు.