Atukula Murukulu : మనం స్నాక్స్ గా మురుకులను తయారు చేస్తూ ఉంటాం. మురుకులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మురుకులను రుచిగా కరకరలాడుతూ ఉండేలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మురుకుల తయారీలో అటుకులు ఉపయోగించడం వల్ల మురుకులు కరకరలాడుతూ ఉంటాయి. అటుకులు వేసి మురుకులను రుచిగా, కరకరఆలడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల మురుకులు తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కప్పు, పుట్నాల పప్పు – పావు కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – అర టీ స్పూన్, కళోంజి విత్తనాలు – అర టీ స్పూన్, ఉప్పు – ముప్పావు టీ స్పూన్ లేదా తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అటుకుల మురుకులు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అటుకులు, పుట్నాల పప్పు వేసి వేడి చేయాలి.అటుకులు కరకరలాడే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లించి ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత నూనె, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మురుకల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత అందులో తగినంత పిండిని ఉంచి నూనెలో మనకు కావాల్సిన ఆకారంలో మురుకులను వత్తుకోవాలి.
తరువాత వీటిని వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ కదిలిస్తూ కాల్చుకోవాలి. మురుకులను మధ్యస్థ మంటపై పైన నురుగు పోయేంత వరకు రెండు వైపుల ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే మురుకులు తయారవుతాయి. వీటిలో మిరియాల పొడికి బదులుగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అటుకులు వేసి చేసిన మురుకులు కూడా చాలా రుచిగా ఉంటాయి. బయట లభించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే అటుకులతో మురుకులన తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.