Mucus In Throat : గొంతులో పేరుకుపోయే కఫం సమస్యతో కూడా మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో మనం ఈ సమస్యను చూడవచ్చు. కొందరు ఈ సమస్యతో రోజంతా ఇబ్బంది పడితే కొందరిలో మాత్రం సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సైనస్ సమస్యతో బాధపడే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చల్లగాలి తగిలిన, నీళ్లు ఎక్కువగా తాగినా, పెరుగు, పంచదార, పాలు, తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా కూడా కఫం ఎక్కువగా తయారవుతుంది. అదే విధంగా నీటిశాతం ఎక్కువగా పండ్లను తీసుకున్నా, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకున్నా కూడా కఫం సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది.
అలాగే అజీర్తి సమస్యతో బాధపడే వారిలో కూడా కఫం ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. కొన్ని రకాల జాగ్రత్తలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా కఫం పేరుకుపోకుండా జాగ్రత్తపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. కఫ శరీరతత్వం ఉన్న వారు , కఫం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. అలాగే సాయంత్రం కాగానే నీటిని తాగడాన్ని తగ్గించాలి. అవసరమైతే నీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగాలి. అలాగే రాత్రి పూట పెరుగు, మజ్జిగను తీసుకోకూడదు. ద్రాక్ష, బత్తాయి. కమలా, పుచ్చకాయ, కర్బూర వంటి పండ్లను, చల్లటి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే పంచదారను, పంచదారతో చేసిన తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కషాయాలను తీసుకోవడం, వేడి నీటిని తాగడం వంటివి చేయాలి. మిరియాల కషాయాన్ని లేదా మిరియాలు, అల్లం, తులసి వేసి కషాయాన్ని తయారు చేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల గొంతులో కఫం పేరుకుపోకుండా ఉంటుంది.
అలాగే చలవ చేసే పదార్థాలను తీసుకోకూడదు. అలాగే గొంతులో పేరుకుపోయిన కఫంతో ఎక్కువగా బాధపడే వారు తమలపాకులతో కషాయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మరింత చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో తలమపాకుల కాడలను తీసేసి వాటిని ముక్కలుగా చేసి వేయాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఈ విధంగా తమలపాకు కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల కఫం సమస్య తగ్గు ముఖం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిట్కాలను పాటించడం వల్ల కఫం సమస్య తగ్గు ముఖం పట్టడంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.