Rice Water With Coconut Oil : మనకు ఎంతో కాలంగా అన్నం ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. బియ్యంతో వండిన అన్నాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మనం సాధారణంగా బియ్యాన్ని కడిగి అన్నం వండుకుంటూ ఉంటాం. బియ్యం కడగగా వచ్చిన నీటిని మనం పారబోస్తూ ఉంటాం. కానీ బియ్యాన్ని కడగగా వచ్చిన నీటిని ఉపయోగించి మనం అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బియ్యాన్ని 20 నిమిసాల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఆ నీటిని 24 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ నీటిలో పోషకాల స్థాయిలు మరింత పెరుగుతాయి.
ఇలా పులియ బెట్టిన బియ్యం నీటిని మన జుట్టుకు కావాల్సిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను లేదా బాదం నూనెను కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఈ నీటిని అరగంట పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. బియ్యం కడిగిన నీటిలో ఇనోసిటాల్ తో పాటు ఇతర పోషకాలు అనేకం ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు పొడిబారడాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ విధంగా బియ్యం నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఎటువంటి జుట్టు సమస్యలు లేని వారు ఈ బియ్యం కడిగిన నీటిని మరో విధంగా ఉపయోగించాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని జుట్టు పట్టించాలి. 4 నుండి 5 నిమిషాల పాటు ఈ నీటిని అలాగే ఉంచి ఆ తరువాత మామూలు నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకు కండీష్ నర్ లాగా పని చేస్తాయి. బియ్యం కడిగిన తరువాత వచ్చే నీటిని పడబోయకుండా ఈ విధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందమైన, ఒత్తైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.