Lips Beauty : మన ముఖం అందంగా కనిపించడంలో మన పెదాలు కీలక పాత్ర పోషిస్తాయి. పెదవులు అందంగా ఉంటేనే మన ముఖం అందంగా కనబడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పెదాలు నల్లగా మారడం, పెదాలు పొడిబారడం, పగలడం, పెదాలు అందవిహీనంగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. పెదవులపై ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ధూమపానం, ఎండకు తిరగడం, వాతావరణ కాలుష్యం, డీహైడ్రేషన్ కు గురికావడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, వాతావరణ మార్పులు, రసాయనాలు కలిగిన లిప్ స్టిక్ లను, లిప్ బామ్ లను ఎక్కువగా వాడడం వంటి వివిధ కారణాల చేత పెదాలు నల్లగా, అందవిహీనంగా మారుతున్నాయి. పెదాలు నల్లగా ఉండడం వల్ల ఎటువంటి సమస్య ఉండకపోయినా ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి.
ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం పెదవులను అందంగా, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల పెదవులు సహజ సిద్దంగానే ఎర్రగా కనిపిస్తాయి. పెదవుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ చిట్కా ఏమిటి..దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ టమాట రసాన్ని తీసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ బీట్ రూట్ రసాన్ని వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా రోజ్ వాటర్ తో పెదవులను శుభ్ర పరుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని సున్నితంగా మర్దనా చేసుకోవాలి. 4 నిమిషాల పాటు ఇలా మర్దనా చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
20 నిమిషాల తరువాత దూదితో పెదవులను తుడుచుకోవాలి. నీటితో కడగకూడదు. ఇలా శుభ్రం చేసిన తరువాత ఏదైనా పెట్రోలియం జెల్లీని పెదవులకు రాసుకోవాలి. ఈ చిట్కాను రాత్రి పడుకునే ముందు వాడడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల పెదవులపై ఉండే నలుపు విరిగిపోతుంది. పెదవులపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. పెదవులు సహజంగానే ఎర్రగా, కాంతివంతంగా తయారవుతాయి. పెదవులు అందవిహీనంగా ఉన్నాయి అని బాధపడే వారు ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.