Cabbage 65 : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని వాసన రుచి కారణంగా చాలా మంది తినడానికి ఇష్టపడరు. క్యాబేజిని ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే ఒక వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ వంటకమే క్యాబేజి 65. మనకు కర్రీ పాయింట్ లలో, క్యాటరింగ్ లలో ఎక్కువగా దీనిని వడిస్తూ ఉంటారు. క్యాబేజి 65 రుచిగా, కరకరలాడుతూ ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా కరకరలాడుతూ ఉండేలా క్యాబేజి 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన క్యాబేజ్ – పావు కిలో, కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, మైదాపిండి – 3 టీ స్పూన్స్, శనగపిండి – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
క్యాబేజ్ 65 తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో క్యాబేజ్ తురుమును తీసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పకోడి పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినంత క్యాబేజి మిశ్రమాన్ని తీసుకుంటూ పకోడిలా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ 65 తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజిని తినని వారు కూడా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.